సింగరేణి వేలంలో పాల్గొనేందుకు అనుమతివ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాల డిమాండ్ 

సింగరేణి వేలంలో పాల్గొనేందుకు అనుమతివ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాల డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: బొగ్గు బ్లాకుల వేలం పాల్గొనేందుకు సింగరేణి కాలరీస్ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని ఆ సంస్థకు చెందిన గుర్తింపు కార్మిక సంఘం(ఏఐటీయూసీ), ప్రాతినిధ్య కార్మిక సంఘం(ఐఎన్టీయూసీ), కోల్​మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ అధికారుల సంఘం డిమాండ్ చేశాయి.

ఈమేరకు విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించినట్టు ఆ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనకప్రసాద్ తెలిపారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గనుల వేలానికి గత ప్రభుత్వ హయాంలోనే అనుమతిచ్చి ఉంటే సింగరేణి భవిష్యత్ మరోరకంగా ఉండేదన్నారు.

నామినేషన్ పద్ధతిలో గనులను కేటాయిస్తే సింగరేణి సంస్థ 14 శాతం రాయల్టీతో పాటు ఎలాట్మెంట్ చేసినందుకు మరో 14 శాతం.. మొత్తంగా 28 శాతం పన్నుల రూపంలో కట్టాల్సి ఉంటుందని తెలిపారు. అదే వేలంలో పాల్గొంటే 4.5 శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. సింగరేణికన్నా బొగ్గును తక్కువ రేటుకు అమ్ముతుండడంతో కోల్ ఇండియా మైన్స్ నుంచి రైల్వే రవాణా పెరుగుతున్నదని చెపారు.

రైల్వే మూడోలైన్ నిర్మాణం కూడా పూర్తయితే సింగరేణి మార్కెట్ పోతుందనీ, భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల సింగరేణిలో ఉత్పత్తిని పెంచాలని, దానికోసం బొగ్గుబ్లాకుల వేలంలో పాల్గొనే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర గనుల నుంచి బొగ్గును వెలికితీసే అనుమతుల్ని కేంద్ర ప్రభుత్వం సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.